Pages

Thursday, March 27, 2014

దేవుడు

చిన్నప్పటి నుంచి మనం పెరిగే వాతావరణం, మన పెద్దవాళ్ళ ఆచార సాంప్రదాయల్ని చూస్తూ పెరగటంవళ్ళ కావచ్చు మనలో చాలామందికి దేవుడనేవాడొకడున్నాడు, దేవుడిని పూజించాలి, ప్రతి పండగకి తప్పకుండా గుడికి వెళ్ళాలి లాంటి నమ్మకాలు ఉంటాయి.

నా దృష్టిలో దేవుడు అంటే

అమ్మ నాన్న

అమ్మ నాన్నల ప్రేమ నిస్వార్ధమైనది.

ఈ సృష్టిలో ప్రతి జీవికి మూల కారణం అమ్మ. నవమాసాలు తన కడుపులో మోసి, తన రక్తాన్ని పంచి, నాకు జన్మనిచ్చిన అమ్మ నా దృష్టిలో దైవం. పుట్టిన్నప్పటినుంచి మననే తన ప్రపంచంలా చూస్తూ, మనకి కొంచం అనారోగ్యంగా ఉన్నా చివరికి అన్నం తినటం కూడా మానేసి మన కోసం కళ్ళళ్ళో వత్తులేసుకొని కూర్చుంటూ..ఒకటా రెండా, ఇలా ఎన్నెన్నో త్యాగాలు మనకోసం చేసే అమ్మ మన మొదటి దైవం కావాలి.
మనకి చిన్న దెబ్బ తగలగానే అమ్మ అని అరుస్తాం...కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ.

జీవితంలో తోటివాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయటం నాన్న దగ్గిరే చూసి నేర్చుకున్న…
మనం పెరిగి పెద్దై ఒక మంచి స్థితిలొ ఉన్నామంటే నాన్న శ్రమ, భాద్యతలే కారణం...
ఏదడిగినా కాదనకుండా మనకోసం తన పనులు, అవసరాలు ఆపుకొని చేసిపెట్టే నాన్న, మన విజయాలను తన విజయాలుగా చెప్పుకునే నాన్న మనకు రెండో దైవం కావాలి. నా కోసం ఎన్నో అవమానాలు భరించిన అమ్మకి, ముఖ్యంగా నాన్నకి ఒక్కసారి కూడ మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పలేదు…

అమ్మమ్మ తాతాయ్య

నా చిన్నతనం, ఇంకా చెప్పాలంటే పదవ తరగతి వరకు అమ్మమ్మ తాతాయ్య వాళ్లతోనే….
అమ్మ నాన్నలతో సమానంగా నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ తాతాయ్యలు కూడా నాకు దేవుళ్లతో సమానం.
ఉన్నదాంట్లోనే నలుగురితో పంచుకుంటే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో వీళ్ళని చూస్తూ పెరిగాను.

చెల్లి బావ

కూతురి కోసం జీవితంలో ఇప్పటికే ఎన్నో త్యాగాలు చేసిన చెల్లి, బావ లో కూడ నాకు దైవత్వం కనిపిస్తుంది.

కష్టకాలంలో వెనకా ముందు అలోచించకుండా డబ్బులు ఇచ్చి ఆదుకున్న నా స్నేహితుడు నాకు దేవుడు.
ఇంకా చాలా మంది చాలా సంధర్భాలలో నాకు సహాయ సహకారాలు అందించారు.

వీళ్ళని నిర్లక్ష్యం చేస్తూ కనిపించని దేవుడికి పూజిస్తే కలిగేది పుణ్యం కాదు...

ముక్కు మీద వందసార్లు గీసుకుంటే దేవుడు కనిపిస్తాడనో, గుడికి వెళ్ళకపోతే మంచి జరగదనో, కనిపించే ప్రతి చెట్టుకి పుట్టకి మొక్కితే పుణ్యం కలగదు..చాలామంది గుడికి వెళ్ళి హుండీలో తోచినవిధంగా నగదు సమర్పిస్తారు...వారిలో ఎంతమంది ఆకలితో ఉన్న ఒక కుర్రాడికి పది రూపాయలు ఒకటికి పది సార్లు అలోచించకుండా ఇవ్వగలరు...నువ్వు చేసే పని వళ్ళ ఎవరికన్న మంచి జరిగితే వాళ్ళకు నువ్వు దేవుడు..అది దైవత్వం అంటే.. అంతే కాని ఎక్కడో ఉన్న తిరుపతో, విజయవాడో, షిర్డీనో ఎంతో ఖర్చులు పెట్టుకోని వెళ్ళి, అక్కడ కానుకగా మళ్ళీ కొంత సమర్పించుకుంటే ఏమొస్తుందో అర్ధం కాదు. ఆ ఖర్చులో కనీసం సగం దానం చేసినా ఎంతో కొంత పుణ్యం కలుగుతుంది. అలాగే నీకు కష్టకాలంలో సహాయం చేసే ఏ వ్యక్తి అయినా నీకు దేవుడితో సమానం.

దేవుడు లేడు, దేవుడిని నమ్మొద్దు అని నేను చెప్పట్లేదు...దేవుడి పేరుతో మూర్ఖత్వంగా ముఢాచారాలను పాటించొద్దు….వీలైతే నలుగురికి సహాయం చెయ్యండి..

1 comment: