Pages

Friday, November 30, 2018

నగర జీవితం - పల్లె జీవితం


ఏముంది నగర జీవితంలో, ఎటు చూసినా కాంక్రీట్ అడవులు, ట్రాఫిక్ జాములు, నీళ్ళ కాలుష్యం, వాయు కాలుష్యం, ఏ కాలుష్యం పడితే ఆ కాలుష్యం...తాగే పాలు కల్తీ, తినే తిండి కల్తీ….
కూరగాయలు, పండ్లు వంటి వాటిలో ఏ విష పదార్ధాలున్నాయో తెలియదు.
పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎ.సి. లో గడిపి కొంచెం ఎండలోకి వస్తే చాలు తల పైకెత్తి చూడలేకపోతున్నాం.
పాల ఉత్పత్తి కోసం పశువులకి ఏవొ హార్మోన్ ఇంజక్షన్లు చేయటం, లేదా ఏవో రసాయనాలు కలిపి కృత్రిమ పాలు తయారుచేయటం, ఆ పాలు మనం తాగి లేని పోని రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. చివరికి మంచినీళ్ళు కూడా కొనుక్కొని తాగుతున్నాం. కనీసం అవి అయినా మంచివేనా అంటే చెప్పలేని దుస్థితి. ఈ మంచి నీళ్ళు కొనుక్కొని తాగే పాడు సంస్కృతి పల్లెలకు కూడా వ్యాపిస్తుంది మెల్ల మెల్లగా.


ఇక కూరగాయలు పండ్లు విషయానికొస్తే అవి తాజాగా ఉండటానికి వాటిపైన వ్యాక్స్(మోతాదుకి మించి) వేస్తున్నారు. అంతే కాకుండా చాలా కూరగాయలపై రకరకాల ఎరువుల అవశేషాలు అలానే ఉంటాయి..అలాగే కొన్ని పండ్లు త్వరగా పండాలని రకరకాల రసాయనాలు జల్లుతారు. ఆరోగ్యం కోసమని మనం తినే కూరగాయలు పండ్లు మనకి తెలికుండానే అనారోగ్యాన్ని కొని తెచ్చిపెడుతున్నాయి.వ్యాపారం చేసేవాడెప్పుడూ లాభాపేక్షతోనే చేస్తాడు..ఇలాంటివి జరగటం సహజం...ఇలా జరగకూడదు అని అనుకోవటం మన పిచ్చి. పసిపిల్లలకు ఎక్కువగా ఆహారమైన పాలని కూడా ఇంత దారుణంగా కల్తీ చేస్తున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు వ్యాపారం చేసేవాళ్ళకు డబ్బే ముఖ్యం అని.


ఊర్లో వాతావరణం ఇందుకు పూర్తిగా విరుద్ధం. పాలు మనమే పితుక్కోని తాగొచ్చు, మనకున్న స్థలంలో మనమే కావలసిన కూరగాయలు పండించుకోవచ్చు.అలాగే కాలానుగుణంగా లభించే మామిడికాయలు, బొప్పాయి, జామ, దానిమ్మ, నారింజ, అరటి, పనస, ఉసిరి, సీతాఫలం వంటి పండ్లు చాలా వరకు మనకు ఊర్లో దొరుకుతాయి.


మనం ఇక్కడే నగరాల్లో బతుకుతున్నాం, మన పిల్లలు ఇక్కడే పుడతారు, ఇక్కడే పెరుగుతారు. ఇది కోడి, ఇది ఆవు, ఇది పిచ్చుక, ఇది తూనిగ, ఇది కోకిల అని ఫోటోల్లో చూపించటం తప్పితే మన పిల్లలు వాటిని చూడలేరేమో అనిపిస్తుంది. తెలతెలవారుతుండగానే కోడికూతకు లేచిన రోజులున్నాయి, ఇంటి బయట మంచాలు వేసుకొని ఆకాశంలో నక్షత్రాలకేసి అలా చూస్తూ పడుకున్న రోజులున్నాయి. నగర జీవితంలో రాత్రిల్లు నక్షత్రాలు కనిపించాయంటే అదొక వింత.


ఏ కారణం చేతనైతేనేమి, పండించేవాడికన్నా తినేవాళ్ళు ఎక్కువైతే తిండి ఎక్కడినుంచి దొరుకుతుంది.
అన్ని కృత్రిమంగా తయారు చేస్తున్నారు.
రేపటి ప్రపంచాన్ని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది.
కనీసం నా చివరి రొజుల్లో అయినా నా బాల్యంలో నేను పెరిగిన ప్రపంచంలో ఉండాలని కోరుకుంటున్నా.